Sunday, July 27, 2008

బాంబు పేలుళ్ళ గురించి కొన్ని సూచనలు

ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో మనం సాహసించి రిపోర్టింగ్ చేస్తున్నాం. బాంబు పేలినా, పేలక పోయినా మనం కవరేజి కోసం సంఘటనాస్థలానికి వెళ్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మన మీద ఆధారపడిన వారికి దూరమవుతాం. అందుకే మనం బాంబు పేలుళ్ళ సమయంలో వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

జాగ్రత్తలు


  • మనం బాంబు పేలిన ప్రదేశానికి వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ పేలకుండా మిగిలిన బాంబులు పేలే ప్రమాదం ఉంటుంది. కావున మనం అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. నేటి పోటీ ప్రపంచంలోఅందరికంటే ముందే ఇవ్వాలన్న తాపత్రయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కాని కేవలం మనకోసమే కాదు, మన వాళ్ల కోసం, మన తోటి సమాజం కోసం మన వంతు ప్రయత్నం చేయాలి.


  • ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా కొన్ని బాంబులను కాసేపటి తర్వాత పేలేలా, అంటే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పేలే ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. అందుకే మనం తెలీకుండా వారి ట్రాప్ లో చిక్కుకుంటాం.


  • బాంబు పేలితే దాని ప్రభావం 'V' ఆకారంలో ఉంటుంది. ఆ సమయంలో మనం వెంటనే నేలమీద చేతులు ముందుకు చాచి పడుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు.

  • పేలుడులో గాయపడిన వారిలో ఎక్కువ మందికి వెంటనే వైద్యం అందకపోవడం వల్ల చనిపోతారు. మనం వీలైనంత త్వరగా వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. మనం మాత్రం ప్రశ్నలు సంధిస్తూ వారి ప్రాణాలు తీస్తుంటాం. ఆ పరిస్థితిలో మనవాళ్ళను ఒకసారి ఊహించుకుంటే...? అలా చేయం కదా?

ఇకపోతే అందరికంటే మనం ప్రత్యేకంగా ఇవ్వాలనో, లేదా మన బాస్ మెప్పు కోసమో మనం ఇచ్చే వార్తలు ఏమీ తెలియని సాధారణ వ్యక్తులకు బాంబులు ఎలా తయారు చేయొచ్చో తెలిసేలా చేస్తున్నాయి. ఇలాంటి వార్తల విషయంలో మనం సమాజ శ్రేయస్సును మర్చిపోతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

No comments: