Friday, March 18, 2011

ప్రమాదం అంచున ఆరోగ్యం

క్రైం రిపోర్టర్ల ఆరోగ్యం ప్రమాదం అంచున ఉంది. పని ఒత్తిడి, ఎక్కువ సమయం cell phoneతో గడపడం, సరైన నిద్ర లేకపోవడం వారి ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వైద్య నిపుణులు సూచించే రోజుకు 8గంటల నిద్ర అన్నది వారి జీవితంలో ఏనాడూ కనిపించడం లేదు. రోజుకు 18 నుంచి 20 గంటలపాటు పనిచేస్తూనే కనిపించే ఏకైక వృత్తి ఏదైనా ఉందంటే అది క్రైం రిపోర్టింగ్ మాత్రమే.

జపాన్ అణు విద్యుత్తు కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్ గురించి మనం చర్చించుకుంటున్నాం. కానీ నిత్యం సెల్ ఫోన్ మితిమీరి ఉపయోగిస్తూ అంతకంటే ఎక్కువ రేడియేషన్ కి గురవుతున్నారు క్రైం రిపోర్టర్లు. దీని ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థ మీద ఉంటుంది. ఫలితంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా క్రైం రిపోర్టర్లు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం డాక్టర్ దగ్గరికెళ్లే తీరిక కూడా లేని ఉద్యోగాలతో ఈ సమస్యలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యలన్నీ పేరుకుపోయి ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలినట్టు బయటపడితే కోలుకోవడం అసాధ్యం.

నిద్ర ఎంత ముఖ్యమన్నది ఎవరో వైద్య నిపుణులు చెబితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానులేం కాదు. అయినా పోటీ ప్రపంచంలో తప్పడం లేదు. కానీ శరీరం సహకరించాలి కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోలు ఇందుకు నిదర్శనం. సరైన నిద్రలేకనో.. ఏమో... CCS దగ్గర పికెటింగ్ చేస్తున్న వివిధ ఛానెళ్ల క్రైం రిపోర్టర్లు చెట్టుకింద నిద్రకు ఉపక్రమించారు. కాదు కాదు.. వారి శరీరాలు బలవంతంగా రెస్టు కోరుకున్నాయి.

ఏదేమైనా.. నిద్ర అన్నది చాలా ముఖ్యం. ఛానెళ్ల మధ్య పెరిగిపోతున్న అనారోగ్యకర పోటీని మనందరం కలిస్తే తగ్గించవచ్చు. మన సంక్షేమం కూడా మనకు ముఖ్యమే. మనిషికి ఒకే జీవితం. మరణానంతర జీవితం గురించి నమ్మకం ఉన్నవాళ్లకు చెప్పలేం. కానీ ఉన్న ఈ ఒక్క విలువైన జీవితాన్ని అందంగా, ఆరోగ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఏమంటారు?

Saturday, February 26, 2011

క్రైం రిపోర్టర్లు - ఒత్తిడి - డిప్రెషన్






క్షణక్షణం.. అనుక్షణం.. పోటీ పోటీ పోటీ.. కాలంతో పోటీ.. కలంతో పోటీ.. ఒత్తిడితో పోటీ.. పోటీతో పోటీ.. ఇదే నేటి క్రైం రిపోర్టర్ల జీవితం. ఛానెళ్లు పెరుగుతున్న కొద్దీ.. పోటీ పెరుగుతోంది. అందరికంటే ముందుండాలనే తాపత్రయం క్రైం రిపోర్టర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా చేస్తోంది. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. సినిమా చూస్తున్నా.. స్నేహితుడి పెళ్లిలో ఉన్నా.. బాత్రూంలో ఉన్నా.. చివరకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే.. అనుక్షణం ఆన్ డ్యూటీయే. సెల్ ఫోన్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సిందే. లేదంటే ఏక్షణంలో ఏం miss అయిపోతామోననే భయం. చివరకు బ్యాటరీ అయిపోతున్నా.. మరో బ్యాటరీ మార్చాల్సిందే. లేదంటే చార్జింగ్ కోసం వెతుకులాడాల్సిందే. ఈ పరిస్థితి క్రైం రిపోర్టర్లను machineలా మార్చేస్తుంది. మెషీన్ అయినా నయం.. పవర్ కట్ పుణ్యమా అని కాసేపైనా rest తీసుకుంటుంది. కానీ క్రైం రిపోర్టర్ కి ఆ ఛాన్స్ కూడా లేకపోయింది.


ఈ చరాచర సృష్టి మొత్తమ్మీద అత్యంత తీవ్ర దారుణమైన ఒత్తిడికి గురయ్యేది ఎవరంటే ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్పే సమాధానం.. క్రైం రిపోర్టర్. ఒత్తిడిని దూరం చేయడానికి అనేక మార్గాలున్నాయి. కానీ ఏమార్గమూ క్రైం రిపోర్టర్ కు సరిపోదు. ఎందుకంటే.. ఆ మార్గంలోకి వెళ్లే సమయం ఉండాలి కదా. కుటుంబం సంగతి సరే.. బంధుమిత్రులకు విలన్ కావాల్సిందే. "మీడియాలో పనిచేస్తున్నాడనే పొగరు.. కొమ్ములొచ్చాయి వీడికి.. అసలేమాత్రం పట్టించుకోవడం లేదు" ఇలాంటి విమర్శలు తరచూ ఎదుర్కోవాల్సిందే. కారణం.. తీరికలేని Lifestyle. ఒక్కోసారి తినడానికి కూడా తీరికుండదు. ఆ తినే సమయంలో ఏం miss అవుతామోనన్న భయమో.. లేక ఒక్కపూట తినకపోతే చస్తామా అన్న మొండివాదమో తెలియదుగానీ.. అనేక సందర్భాల్లో కడుపు మాడ్చుకుంటూ కూడా డ్యూటీలు చేస్తున్నారు.

ఒత్తిడి అనేక మానసిక రుగ్మతలకు, సమస్యలకు మూలం. దీని పర్యవసానాలు కోపం, విసుగు, చిరాకు, Hyper tension, BPలు మాత్రమే కాదు... ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు కూడా ఒత్తిడే కారణమవుతోంది. ఇది అనేక శాస్త్రీయ సర్వేలు తేల్చిన చేదు నిజం. అంగీకరించక తప్పని వాస్తవం. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి జర్నలిస్టులు ఆశ్రయించే దివ్యౌషధం మద్యం, ధూమపానం. ఇవి తాత్కాలికంగా ఒత్తిడి నుంచి ఉపశమనాన్నిస్తాయేమోగానీ.. శాశ్వతంగా అనేక సమస్యలను సృష్టిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కుల సంఘాల నుంచి మొదలుకుని, అత్యున్నత సర్వీసుల అధికారుల (All India Services) వరకు సంఘాలున్నాయి. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. ఖర్మకాలి జర్నలిస్టులకు కూడా సంఘాలున్నాయి. కానీ సంక్షేమం కోసం శ్రమించే తీరిక మాత్రం లేదు. ఇందుకు ఏ ఒక్కరినీ తప్పుపట్టలేం. జీవితాలు అలాంటివి మరి.


క్రైం రిపోర్టర్ల సంక్షేమం, ఇతర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన Crime Reporters Association - CRA ఈ విషయంపై దృష్టిపెడితే మంచిది. మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల మీద సర్వే చేస్తున్న అనేక సంస్థలున్నాయి. ఒత్తిడి నుంచి దూరం చేసే అనేక ప్రత్యామ్నాయాలను చూపెడుతున్నాయి. వీటిలో కొన్నింటినైనా (CRA) సంఘం తరఫున క్రైం రిపోర్టర్లకు అందజేస్తే కొంతైనా ఫలితం ఉంటుంది. క్రైం రిపోర్టర్లపై దుర్భాషలాడిన రవితేజ సోదరుడు భరత్ భరతం పట్టిన CRA ఈ విషయంపై కూడా దృష్టి కేంద్రీకరిస్తే నేర పాత్రికేయ సమాజానికి ఎంతో ఉపకారం చేసినట్టే.

Thursday, February 24, 2011

Crime Reporters Association

సమాజంలో కొన్ని వర్గాలకు targetగా మారుతున్న తరుణంలో Crime Reporters కోసం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం శుభసూచకం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా వాలిపోయే క్రైం రిపోర్టర్లకు తమ సమస్యలు, సాధకబాధకాలు చెప్పుకోడానికి ఇన్నాళ్లూ ఓ వేదిక లేకపోయింది. తాజాగా ఏర్పాటైన CRA ఆ లోటును తీరుస్తుందని ఆశిస్తున్నాను. క్రైం రిపోర్టర్ల సమస్యలను పరిష్కరించడానికి CRA నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని భావిస్తున్నాను.

APUWJకి అనుబంధంగా పనిచేసే CRAకి ప్రస్తుతం అడ్-హక్ కమిటీ మాత్రమే ఏర్పాటైంది. పూర్తిస్థాయిలో CRAని అభివృద్ధిపరిచి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత నాయకత్వం మీద ఉంది. ప్రారంభంలో బాలారిష్టాలు అత్యంత సహజం. ప్రస్తుతం CRA నిధుల లేమి సమస్యను ఎదుర్కొంటోంది. దీన్ని వీలైనంత త్వరగా, చట్టబద్దమైన పద్ధతుల్లో నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది.


ఇతరులతో పోలిస్తే పాత్రికేయుల్లో ఐక్యత పాళ్లు తక్కువ. అహం కారణంగా వచ్చే బేధాభిప్రాయాలు ఎక్కువ. అయితే మెజారిటీ అభిప్రాయానికి విలువిస్తూ అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత నాయకత్వానిదే. అన్నింటికంటే ముఖ్య విషయం CRA ఎలాంటి ఆరోపణలకు ఆస్కారమివ్వకుండా వ్యవహరించాలి. ప్రతి విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. అప్పుడే CRA నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అందరి మెప్పు పొందుతుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, అవినీతిని దరిచేరనీయకుండా కలిసికట్టుగా ముందుకు పోదాం. మనల్ని మనం కాపాడుకుందాం.

జైహింద్ - జై CRA