Into that heaven of freedom, my Father, let my country awake -Ravindranath Tagore
Saturday, February 26, 2011
క్రైం రిపోర్టర్లు - ఒత్తిడి - డిప్రెషన్
క్షణక్షణం.. అనుక్షణం.. పోటీ పోటీ పోటీ.. కాలంతో పోటీ.. కలంతో పోటీ.. ఒత్తిడితో పోటీ.. పోటీతో పోటీ.. ఇదే నేటి క్రైం రిపోర్టర్ల జీవితం. ఛానెళ్లు పెరుగుతున్న కొద్దీ.. పోటీ పెరుగుతోంది. అందరికంటే ముందుండాలనే తాపత్రయం క్రైం రిపోర్టర్లను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా చేస్తోంది. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా.. సినిమా చూస్తున్నా.. స్నేహితుడి పెళ్లిలో ఉన్నా.. బాత్రూంలో ఉన్నా.. చివరకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా సరే.. అనుక్షణం ఆన్ డ్యూటీయే. సెల్ ఫోన్ ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాల్సిందే. లేదంటే ఏక్షణంలో ఏం miss అయిపోతామోననే భయం. చివరకు బ్యాటరీ అయిపోతున్నా.. మరో బ్యాటరీ మార్చాల్సిందే. లేదంటే చార్జింగ్ కోసం వెతుకులాడాల్సిందే. ఈ పరిస్థితి క్రైం రిపోర్టర్లను machineలా మార్చేస్తుంది. మెషీన్ అయినా నయం.. పవర్ కట్ పుణ్యమా అని కాసేపైనా rest తీసుకుంటుంది. కానీ క్రైం రిపోర్టర్ కి ఆ ఛాన్స్ కూడా లేకపోయింది.
ఈ చరాచర సృష్టి మొత్తమ్మీద అత్యంత తీవ్ర దారుణమైన ఒత్తిడికి గురయ్యేది ఎవరంటే ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేకుండా చెప్పే సమాధానం.. క్రైం రిపోర్టర్. ఒత్తిడిని దూరం చేయడానికి అనేక మార్గాలున్నాయి. కానీ ఏమార్గమూ క్రైం రిపోర్టర్ కు సరిపోదు. ఎందుకంటే.. ఆ మార్గంలోకి వెళ్లే సమయం ఉండాలి కదా. కుటుంబం సంగతి సరే.. బంధుమిత్రులకు విలన్ కావాల్సిందే. "మీడియాలో పనిచేస్తున్నాడనే పొగరు.. కొమ్ములొచ్చాయి వీడికి.. అసలేమాత్రం పట్టించుకోవడం లేదు" ఇలాంటి విమర్శలు తరచూ ఎదుర్కోవాల్సిందే. కారణం.. తీరికలేని Lifestyle. ఒక్కోసారి తినడానికి కూడా తీరికుండదు. ఆ తినే సమయంలో ఏం miss అవుతామోనన్న భయమో.. లేక ఒక్కపూట తినకపోతే చస్తామా అన్న మొండివాదమో తెలియదుగానీ.. అనేక సందర్భాల్లో కడుపు మాడ్చుకుంటూ కూడా డ్యూటీలు చేస్తున్నారు.
ఒత్తిడి అనేక మానసిక రుగ్మతలకు, సమస్యలకు మూలం. దీని పర్యవసానాలు కోపం, విసుగు, చిరాకు, Hyper tension, BPలు మాత్రమే కాదు... ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు కూడా ఒత్తిడే కారణమవుతోంది. ఇది అనేక శాస్త్రీయ సర్వేలు తేల్చిన చేదు నిజం. అంగీకరించక తప్పని వాస్తవం. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి జర్నలిస్టులు ఆశ్రయించే దివ్యౌషధం మద్యం, ధూమపానం. ఇవి తాత్కాలికంగా ఒత్తిడి నుంచి ఉపశమనాన్నిస్తాయేమోగానీ.. శాశ్వతంగా అనేక సమస్యలను సృష్టిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కుల సంఘాల నుంచి మొదలుకుని, అత్యున్నత సర్వీసుల అధికారుల (All India Services) వరకు సంఘాలున్నాయి. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. ఖర్మకాలి జర్నలిస్టులకు కూడా సంఘాలున్నాయి. కానీ సంక్షేమం కోసం శ్రమించే తీరిక మాత్రం లేదు. ఇందుకు ఏ ఒక్కరినీ తప్పుపట్టలేం. జీవితాలు అలాంటివి మరి.
క్రైం రిపోర్టర్ల సంక్షేమం, ఇతర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన Crime Reporters Association - CRA ఈ విషయంపై దృష్టిపెడితే మంచిది. మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల మీద సర్వే చేస్తున్న అనేక సంస్థలున్నాయి. ఒత్తిడి నుంచి దూరం చేసే అనేక ప్రత్యామ్నాయాలను చూపెడుతున్నాయి. వీటిలో కొన్నింటినైనా (CRA) సంఘం తరఫున క్రైం రిపోర్టర్లకు అందజేస్తే కొంతైనా ఫలితం ఉంటుంది. క్రైం రిపోర్టర్లపై దుర్భాషలాడిన రవితేజ సోదరుడు భరత్ భరతం పట్టిన CRA ఈ విషయంపై కూడా దృష్టి కేంద్రీకరిస్తే నేర పాత్రికేయ సమాజానికి ఎంతో ఉపకారం చేసినట్టే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment