క్రైం రిపోర్టర్ల ఆరోగ్యం ప్రమాదం అంచున ఉంది. పని ఒత్తిడి, ఎక్కువ సమయం cell phoneతో గడపడం, సరైన నిద్ర లేకపోవడం వారి ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వైద్య నిపుణులు సూచించే రోజుకు 8గంటల నిద్ర అన్నది వారి జీవితంలో ఏనాడూ కనిపించడం లేదు. రోజుకు 18 నుంచి 20 గంటలపాటు పనిచేస్తూనే కనిపించే ఏకైక వృత్తి ఏదైనా ఉందంటే అది క్రైం రిపోర్టింగ్ మాత్రమే.
జపాన్ అణు విద్యుత్తు కేంద్రం నుంచి వెలువడే రేడియేషన్ గురించి మనం చర్చించుకుంటున్నాం. కానీ నిత్యం సెల్ ఫోన్ మితిమీరి ఉపయోగిస్తూ అంతకంటే ఎక్కువ రేడియేషన్ కి గురవుతున్నారు క్రైం రిపోర్టర్లు. దీని ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థ మీద ఉంటుంది. ఫలితంగా పక్షవాతానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా క్రైం రిపోర్టర్లు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం డాక్టర్ దగ్గరికెళ్లే తీరిక కూడా లేని ఉద్యోగాలతో ఈ సమస్యలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యలన్నీ పేరుకుపోయి ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలినట్టు బయటపడితే కోలుకోవడం అసాధ్యం.
నిద్ర ఎంత ముఖ్యమన్నది ఎవరో వైద్య నిపుణులు చెబితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానులేం కాదు. అయినా పోటీ ప్రపంచంలో తప్పడం లేదు. కానీ శరీరం సహకరించాలి కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోలు ఇందుకు నిదర్శనం. సరైన నిద్రలేకనో.. ఏమో... CCS దగ్గర పికెటింగ్ చేస్తున్న వివిధ ఛానెళ్ల క్రైం రిపోర్టర్లు చెట్టుకింద నిద్రకు ఉపక్రమించారు. కాదు కాదు.. వారి శరీరాలు బలవంతంగా రెస్టు కోరుకున్నాయి.
ఏదేమైనా.. నిద్ర అన్నది చాలా ముఖ్యం. ఛానెళ్ల మధ్య పెరిగిపోతున్న అనారోగ్యకర పోటీని మనందరం కలిస్తే తగ్గించవచ్చు. మన సంక్షేమం కూడా మనకు ముఖ్యమే. మనిషికి ఒకే జీవితం. మరణానంతర జీవితం గురించి నమ్మకం ఉన్నవాళ్లకు చెప్పలేం. కానీ ఉన్న ఈ ఒక్క విలువైన జీవితాన్ని అందంగా, ఆరోగ్యంగా మలుచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఏమంటారు?